Featured Post
వాతావరణమార్పులతో వ్యాధులు
వాతావరణ మార్పులు వ్యాధులకు కారణమౌతున్నాయా? ఈ ప్రశ్నకు ‘ది లాన్సెట్’ అవుననే జవాబు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అకడమిక్ జర్...
1, నవంబర్ 2024, శుక్రవారం
రెండు ప్రపంచాలు
నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు భూగోళాన్ని రెండు ప్రపంచాలుగా విడగొట్టిన తీరును, ధనిక`పేదల మధ్య అంతరాలను పెంచిన వైనాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక అద్దం పట్టింది. ‘ ప్రపంచ వాణిజ్య నివేదిక`2024’పేరుతో విడుదలైన దీనిలో డబ్ల్యుటిఓ ఆవిర్భవించిన తరువాత గత 30 ఏళ్ల కాలంలో (1995`2023) సాధించిన అభివృద్ధిని వివరించారు. దానికనుగుణంగానే నివేదిక నిండా గణాంకాలను ఏకరవు పెట్టారు. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల మీద నయానా`భయానా రుద్దిన సరళీకరణ ఆర్థిక విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, నిజాన్ని దాచిపెట్టలేకపోయారు. పెట్టుబడిదారీ విధానం అమలులో అనివార్యంగా మారే సంక్షోభాలు, అవి సృష్టించే సంక్లిష్ట పరిస్థితులను ప్రస్తావించక తప్పని స్థితి! దేశాల మధ్య అంతరాలనే కాదు, ఆ దేశాల్లోని ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతల్ని పేర్కొనక తప్పలేదు! ‘ద్రవ్యోల్బణాన్ని సవరించిన తరువాత ప్రపంచ తలసరి ఆదాయం ఈ 30 ఏళ్ల కాలంలో 65 శాతం పెరిగింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల ఆదాయం రెండు నుండి మూడు రెట్లు పెరిగింది. ఇది వివిధ దేశాల్లో పేదరికాన్ని తగ్గించింది. విద్యను, ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది’ అని ప్రారంభంలో నివేదిక పేర్కొంది. ఇటువంటి మాటల గారడితో నింపివేసినప్పటికీ, ‘అనేక దేశాల్లో ఆదాయ పంపిణీ లో తీవ్ర అసమానతలు ఉన్నాయి.’ ప్రపంచ వ్యాప్తంగా 71.2 కోట్ల ప్రజానీకం ఇంకా తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారు’ ‘ కోవిడ్ సమయంలో కొందరి ఆదాయం అనూహ్యంగా పెరిగింది’ అన్న వ్యాఖ్యలు అసలు వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో తక్కువ, మద్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం గణనీయంగా పెరగిందని చెప్పిన డబ్ల్యుటిఓ 2009వ సంవత్సరం తరువాత జిడిపి తగ్గుదల ,నిరుద్యోగం, పేదరికం పెరగడం వంటి ప్రతికూల ఫలితాలకు మాత్రం తొలుత ఆర్థిక సంక్షోభాన్ని, ఆ తరువాత కరోనాను కారణంగా చూపింది. ‘స్వేఛ్చా వాణిజ్యం ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. పేదరికాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించింది. అయినా, అనేకమంది వ్యక్తులు, ప్రాంతాలు, వ్యవస్థలు ఈ విధానం నుండి ప్రయోజనం పొందలేకపోతున్నారు’ అని పేర్కొంది. అంతేకాదు, ప్రపంచ జనాభాలో 13 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలను లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ (ఎల్‌డిసి)లుగా పేర్కొనడంతో పాటు ఈ దేశాల్లో అంతరాలు తగ్గడానికి బదులుగా మరింతగా పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది. కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు ఈ విషయాలనే చెబుతూ, ప్రజల కష్టాలకు, కడగళ్లకు కారణం వివరిస్తూ, పరిష్కార మార్గాన్ని చూపుతున్న వారిని తప్పుడు ప్రచారం చేస్తున్నవారిగా చిత్రీకరించడానికి డబ్ల్యుటిఓ ప్రయత్నించింది. ‘ఈ విధానాలు పేద దేశాలకు, పేద ప్రజలకు వ్యతిరేకం. ఇవి కొన్ని దేశాల, కొందరు వ్యక్తుల లాభాలను మాత్రమే పెంచుతాయి. కోవిడ్ సమయంలో అనుభవించిన కష్టాలకూ ఇవే కారణం’ అని ప్రపంచీకరణను వ్యతిరేకించే కొందరు ‘అదే పనిగా ప్రచారం చేస్తున్నారు’ అని నివేదికలో డబ్ల్యుటిఓ పేర్కొంది.
పెరుగుతన్న అసమానతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అధిగమించడానికి ఇప్పటిదాకా వ్యతిరేకించిన సంక్షేమ పథకాలనే డబ్య్లుటిఓ ఏకరువు పెట్టింది. కార్మికులకు రాయితీలు ఇవ్వడం, ఉచిత విద్య, వైద్యం, తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందచేయడం, నిరుద్యోగులకు భృతి చెల్లించడం, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చర్యల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పిన ప్రపంచ వాణిజ్య సంస్థ దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రపంచ దేశాలు మరింతగా మార్కెట్ గేట్లను తెరవాలని, వాణిజ్యంలో రక్షణాత్మక విధానాలను ఏమాత్రం అనుసరించకూడదని, ఎగుమతులు, దిగుమతుల అంశాలను మార్కెట్‌కు వదిలి వేయాలని సూచించింది. ఈ సూచనలు ఎవరికి మేలు చేస్తాయో. డబ్ల్యుటిఓ వంటి సంస్థలు ఎవరివైపు మాట్లాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి