Featured Post
రూపాయి మహాపతనం
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...
29, అక్టోబర్ 2024, మంగళవారం
ఔషధాల ధరలు సైతం...
..
ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత కీలకమైన ఔషధాల ధరలు సైతం చుక్కలను దాటి పరుగులు తీస్తున్న తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే 800 రకాల ముఖ్యమైన ఔషధాలను ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రతి సంవత్సరం చోటుచేసుకునే సాధారణ పెంపుగానే దీనిని అప్పట్లో సమర్ధించుకున్న ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఎనిమిది రకాల ఔషధాల ధరలను ఏకంగా 50 శాతం పెంచడానికి అనుమతించింది. ఉబ్బసం, గ్లుకోమా, తలసేమియా, క్షయతో పాటు మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడేవారికి అవసరమైన మందులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో దిక్కుతోచక సతమతమౌతున్న దేశ ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం శరాఘాతంగా మారనుంది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో 1997లో ఏర్పాటైన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) సాంకేతికంగా ఔషధాల ధరలను నియంత్రిస్తుంది. ‘దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల రీత్యా... ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని... అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు’ ధరల పెంపునకు అనుమతిస్తూ ఆ సంస్థ చేసిన ప్రకటన హాస్యాస్పదం! ఉత్పత్తి వ్యయం పెరగడం, ధరల నియంత్రణ చర్యల కారణంగా జౌషధాలను ఉత్పత్తి చేయడం అసాధ్యంగా మారిందంటూ తయారీదారులు భీష్మించుకుకూర్చోవడమే ఎన్‌పిపిఎ చెప్పిన ‘అసాధారణ పరిస్థితి’ ! ఔషధాలను అందుబాటులో ఉంచడానికి ధరలను పెంచడానికి అనుమతివ్వడమే ‘ప్రజాప్రయోజనం’. ఇంతకన్నా అడ్డగోలు వాదన మరోకటి ఉంటుందా?
1997లో ఎన్‌పిపిఎ ఏర్పాటైన తరువాత నుండి ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ధరలను సమీక్షించి పెంపునకూ అనుమతిస్తూనే ఉంది. దీనికోసం ఔషధాలను ప్రభుత్వం షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ తరగతులుగా విభజించింది. ముఖ్యమైన ఔషధాలను షెడ్యూల్డ్ జాబితాలో చేర్చారు. టోకు ధరల సూచిక ఆధారంగా ప్రతీసంవత్సరం ప్రభుత్వం వీటి ఎగువ సీలింగ్ ధరను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ జాబితాలో 384 ఔషధాలు, నాలుగు వైద్య పరికరాలు ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరలను తయారీదారులే కొన్ని నిబంధనలకు లోబడి నిర్ణయించుకోవచ్చు. షెడ్యూల్డ్ ఔషధాల ధరలను నిర్దేశించిన ప్రమాణాల కన్నా ఎక్కువగా పెంచాలని తయారీదారులు అడిగిందే తడవుగా కేంద్రం తలూపింది. ఎన్‌పిపిఎకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి మరీ ఔషధ తయారీ కంపెనీలకు మేలు చేసింది. ఇలా ఉత్పత్తిదారుల ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తలగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనూ, 2021లోనూ ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఈ తరహా నిర్ణయాలనే తీసుకుంది.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ హెల్త్ అక్కౌంట్స్ నివేదిక ప్రకారం ఆరోగ్యంపై పెడుతున్న ఖర్చులో మూడో వంతు మందులకు అవుతోందని ఆ నివేదిక పేర్కొంది. ఇన్సూర్ టెక్ ప్లమ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో మన దేశంలో వైద్య ద్రవ్యోల్బణం 14 శాతానికి చేరింది. సరైన చర్యలు తీసుకోకపోతే ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఆసంస్థ హెచ్చరించింది. ఆన్‌లైన్ బీమా సంస్థ ‘పాలసీ బజార్’ గణాంకాల ప్రకారం 2019లో 17,900 రూపాయలుగా ఉన్న వార్షిక ఆరోగ్య బీమా పాలసీ ధర ఈ ఏడాది 26,533 రూపాయలకు చేరింది. దీనికి ప్రధాన కారణం ఔషధాల ధరల్లో భారీ పెరుగుదల చోటుచేసుకోవడమేనని ఆ సంస్థ తెలిపింది. పెరుగుతున్న ఔషధాల ధరలు సామాన్యులకు పెనుభారంగా మారుతున్న తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డిపిసిఓ) 1979 ప్రకారం ముఖ్యమైన ఔషధాల ధరలను ప్రభుత్వం నియంత్రించేది. నాణ్యమైన, తక్కువ ధరలకు అవసరమైన మందులను ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగం బలంగా ఉండేది. ఆ పరిస్థితి ప్రస్తుతం మారింది. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగాన్ని నీరుగార్చారు. రోగులు వినియోగదారులుగా మారారు. ప్రైవేటు రంగాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం వారిచేతిలో కీలుబమ్మగా మారింది. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పేరుతో అన్ని నియంత్రణలను ఎత్తివేసింది. కార్పొరేట్, బహుళజాతి ఫార్మా కంపెనీల ఇష్టారాజ్యానికి ఔషధ రంగాన్ని వదిలివేసింది. ఫలితం ఏడాదికేడాదికి పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్టుగా సామాన్యుల స్థితి తయారవుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి