Featured Post
రూపాయి మహాపతనం
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...
25, అక్టోబర్ 2024, శుక్రవారం
భయపెట్టే పచ్చదనం
పచ్చదనం కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. భూగోళాన్ని రక్షిస్తుంది. అందుకే పెద్దఎత్తున చెట్లను పెంచాలని పర్యావరణ వేత్తలు చెవిన ఇల్లు కట్టుకుని చెబుతుంటారు. కానీ, అంటార్కిటికా దీనికి భిన్నం. అక్కడ పెరుగుతున్న పచ్చదనం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. భూగోళం భవిత ఏమిటన్న భయాన్ని కలిగిస్తోంది. ఏ వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి చెట్లను పెంచాలని చెబుతారో, ఆ మార్పుల కారణంగానే అంటార్కిటికాలో పచ్చదనం పెరుగుతుండటమే దీనికి కారణం. దుప్పటి పరిచినట్టు కిలోమీటర్ల తరబడి తెల్లటి మంచు తప్ప మరేమీ కనపడని హిమఖండం అంటార్కిటికా వాతావరణ మార్పుల కారణంగా క్రమేణా వేడెక్కుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఉష్ణతాపానికి తరతరాలుగా ఇక్కడ పేరుకుపోయిన మంచు వేగంగా కరుగుతోంది. ఎంతగా అంటే, ఎప్పుడూ మైనస్ డిగ్రీలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిలో పది డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. వేడి గాలులు కూడా వీస్తున్నాయి. భూగోళం మీద ఉష్ణోగ్రత పెరుగుదల రేటు అత్యధికంగా అంటార్కిటికాలోనే నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఫలితంగా గత ఐదు సంవత్సరాల కాలంలోనే నాలుగు లక్షల మీటర్ల మేర పచ్చదనం విస్తరించింది. హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సముద్రమట్టాలు పెరిగి భూగోళం ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఇదొక్కటే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారాను ఇటీవల వరదలు ముంచెత్తడం కూడా ఇటువంటి ఆందోళన కలిగించే పరిణామమే! సెప్టెంబర్ నెలలో చోటుచేసుకున్న సహారా వర్షాలు, వరదలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులతో పాటు కలవరపరిచే వరదలు కూడా సహారా భవిష్యత్తులో భాగం కానున్నాయి. ఇసుక ప్రవాహాలకూ దారి తీసే ప్రమాదం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రూపొందించిన 2024 స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్టు ముంచుకొస్తున్న సంక్షోభం గురించి చేసిన హెచ్చరికను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఉద్గారాల నియంత్రణలో వివిధ దేశాల ప్రభుత్వాలు తమ లక్ష్యాలను చేరుకున్నప్పటికీ ప్రపంచ ఉష్ణోగ్రతల స్థాయి 2.7 సెల్సియస్ డిగ్రీలకు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. సౌర, పవన ఇంధనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గకపోగా ఏటికేడాది మరింతగా పెరుగుతోందని ఈ నివేదికలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మన దేశంమీద కూడా ఈ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలను చవి చూడగా, వర్షాకాలంలో భారీ వరదలు సృష్టించిన నష్టాలతో దేశం అతలాకుతలమైంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాంలతో పాటు మన రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా తరచూ ముంపునకు గురయ్యే ముంబై, ఢల్లీి, బెంగళూరు వంటి మహానగరాల సరసన మన విజయవాడ కూడా చేరింది. అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతపవనాల సంబంధిత విపత్తుల వల్ల 1,400 మంది అధికంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే 200 మంది మరణించారు. ఆస ి్తనష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నివారణ చర్యల కంటే, విపత్తు అనంతర ఉపశమన చర్యలపైనే ప్రభుత్వాలు అధికంగా దృష్టి సారించడం ఈ పరిస్థితికి కారణం. వాతావరణ మార్పుల ప్రభావం అనివార్యంగా మారిన పరిస్థితుల్లో ప్రోయాక్టివ్ విధానాల అమలుకు ప్రభుత్వాలు సిద్ధం కావాల్సిఉంది. ఈ దిశలో అవసరమైన సమగ్ర చర్యలను దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. నవంబర్ నెలలో ఐక్యరాజ్యసమితి వార్షిక వాతావరణ చర్చలు (కాప్`29) అజర్‌బైజాన్‌లో జరగనున్నాయి. ఈ సమావేశంలోనైనా మన దేశం స్వతంత్ర గళం వినిపించాలి. ఉద్గారాల విషాన్ని వెదజల్లడంపై సంపన్న దేశాలను నిలదీయాలి. అటువంటి స్వతంత్ర వైఖరే వాతావరణ మార్పుల విపత్తుల నుండి మన దేశాన్ని, అంటార్కిటికా వంటి మంచు ఖండాల్ని, మొత్తం భూగోళాన్ని కాపాడుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి