Featured Post

రూపాయి మహాపతనం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...

21, డిసెంబర్ 2024, శనివారం

రూపాయి మహాపతనం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక శాతం క్షీణించింది. ఇదే ఒక రికార్డు కాగా, గురువారం ఈ పతనం మరింత దిగ్భ్రాంతికర స్థాయికి చేరింది. రూపాయి విలువ 85.08కి పడిపోయింది.ఇది ఆ ముందురోజుతో పోలిస్తే 14 పైసల తగ్గుదల. అంటే ఒక్క డాలర్‌కు బదులుగా 85 రూపాయల ఎనిమిది పైసలు చెల్లించాల్సి వస్తుందన్నమాట! రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం గతంలో ఎన్నడూ లేదు. అందుకే ఈ పరిణామం ఆర్థిక నిపుణుల్లో కలకలం రేపింది. రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంలో ఈ చర్యలు ఏమాత్రం సుస్థిర ఫలితాలను సాధిస్తాయో వేచి చూడాల్సిందే! రూపాయి పతనం కొంత కాలంగా కొనసాగుతూనే ఉండటమే ఈ సందేహాలకు కారణం.సెప్టెంబర్‌ నెల నుండి ఈ పతనం స్పష్టంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 12వన డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.98కి పడిపోయింది. అప్పట్లో అదో రికార్డు. ఆ స్థాయికి రూపాయి విలువ పడిపోవడం అదే మొదటిసారి కావడంతో కలకలంరేగింది. మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక నిపుణులు రకరకాల విశ్లేషణలు చేశారు. అయితే, ప్రజలను చీల్చి ఎన్నికల పబ్బాలను గడుపుకునే పనిలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి అప్పట్లో ఈ విషయమే పట్టలేదు. ఫలితంగా పతనంలో రూపాయి కొత్త రికార్డులు సృష్టించడం ప్రారంభమైంది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఈ దిశలో సంకేతాలు కనిపించాయి. ‘నిశితంగా గమనిస్తున్నాం. 2025 సంవత్సరం వరకు పతనం 84 రూపాయల మార్కుకు చేరకుండా చూస్తాం.’ అని ఆర్‌బిఐ వర్గాలు అప్పట్లో మీడియా ప్రతినిధులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాని జరిగింది వేరు. చూస్తుండగానే అక్టోబర్‌లో 84 రూపాయలకు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవ సారి ఎన్నికైనప్పటినుండి రూపాయి పతనం మరింత వేగంగా కొనసాగింది. అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన నవంబర్‌ ఆరున డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 84.23గా ఉంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న వివిధ ఇతర పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరుగుతాయన్న అంచనాలు కూడా రూపాయి విలువ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తంమీద రూపాయి వేగంగా పతనం చెందడంతో ఇప్పుడు ఒక డాలర్‌ విలువ 85 రూపాయలకుపైగా చేరింది. దీంతో రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది. స్టాక్‌ మార్కెట్‌లోని విదేశీ పెట్టుబడులకు రెక్కలు వస్తున్నాయి. తమ పెట్టుబడుల విలువలు తగ్గిపోతుండటంతో విదేశీ మదుపర్లకు భారత మార్కెట్‌ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఒక్క నవంబర్‌ నెలలోనే 38 బిలియన్‌ డాలర్లను విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) ఉపసంహరించుకున్నారు. ఈ ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. దీనిప్రభావం దేశీయ మార్కెట్‌పైనా ఇదితీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కొంతకాలంగా సెన్సెక్స్‌ నేల చూపులు చూస్తుండటమే దీనికి నిదర్శనం. నరేంద్రమోడీ దేశ ప్రధానిగా ఎన్నిక కావడానికి దోహదంచేసిన అనేక కారణాల్లో రూపాయి పతనం కూడా ఒకటి. 2014వ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 62.33 గా ఉండిరది. మోడీ అండ్‌కో దీనినే దేశ ప్రజల ముందు భూతద్దంలో చూపారు. తాము అధికారంలోకి వస్తే రూపాయిని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలోపేతం చేస్తామని, రూపాయి కోసం విదేశాలు క్యూలు కట్టే విధంగా చేస్తామని ప్రచారం చేశారు. కానీ, జరిగింది వేరు. దాదాపుగా ప్రతి ఏడాది రూపాయిది పతనోన్ముఖమే! బలహీనమైన రూపాయి కారణంగా దిగుమతులు మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో లోటు భారీగా పెరుగుతోంది. దీనికితోడు ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడం, తలసరి ఆదాయం పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకే పోతుండటం, జీవన ప్రమాణాలు పడిపోవడం వంటి మోడీ ప్రభుత్వ విధానాల ఫలితాలు కూడా దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఈ విధానాలను ప్రతిఘటించి, ప్రత్యామ్నాయం వైపు మళ్లడమే అన్ని సమస్యలకు పరిష్కారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి