Featured Post

రూపాయి మహాపతనం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...

8, నవంబర్ 2024, శుక్రవారం

జిడిపి పతనం దేనికి సంకేతం...?

ఆర్థిక వ్యవస్థ పనితీరుకు కొలమానగా భావించే స్థూల దేశీయ ఉత్పత్తి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్టు -జిడిపి) గణాంకాల్లో వృద్ధి తగ్గుదల నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) సెప్టెంబర్‌ నెలలో క్రితం విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌ -జూన్‌ మధ్య కాలంలో 6.7 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. గడిచిన పదిహేను నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో జిడిపి వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఇదే కాలంలో 8.2శాతంగా జిడిపి వృద్ధి ఉంది. రిజర్వు బ్యాంకు అంచనాల కన్నా కూడా ఈ ఏడాది సాధించిన వృద్ధి చాలా తక్కువ. గత సంవత్సరం ఏడాది పొడవునా సగటున 8 శాతం జిడిపి వృద్ధి నమోదు కావడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 7.2 శాతం జిడిపి వృద్ధిని తొలుత ఆర్‌బిఐ అంచనా వేసింది. ఆ తరువాత దానిని సవరించి 7.1 శాతం వృద్ధి ఖాయమని పేర్కొంది. దానికి భిన్నంగా వాస్తవ గణాంకాల్లో గణనీయమైన తగ్గుదల నమోదుకావడంతో భిన్న వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. -జివిఎ) గణాంకాలు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టాయి. జివిఎ 8.3 శాతం నుండి 6.8 శాతానికి తగ్గినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు, ఆయన వందిమాగాధులు ప్రతిరోజు ఘనంగా చెప్పుకుంటున్న సమయంలోనే వృద్ధి లెక్కల్లో వేగవంతమైన తిరోగమనం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ పతనానికి గల కారణాలను గుర్తించి సరిదిద్దడానికి బదులుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సాకులు వెతుకుతోంది. ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు వెల్లడిరచిన తరువాత స్పందించిన ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిడిపి పతనానికి కారణంగా చెప్పారు. ఎన్నికల కోడ్‌ కారణంగా వివిధ పథకాలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే వ్యయం గణనీయంగా తగ్గడమే దీనికి దారి తీసిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులు మరో కారణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ కూడా ఖర్చు తగ్గుముఖం పట్టడం వృద్ధి పతనానికి కారణమని అన్నారు. ఈ మాటల అర్ధం ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ వ్యయం కీలకమనే కదా! కానీ దీనిని అవకాశంగా తీసుకుని ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థల మానిటైజేషన్‌ను మరింత వేగంగా పూర్తి చేయాలన్న సూచనలు కార్పొరేట్‌ మేధావుల నుండివస్తున్నాయి. అయితే, జిడిపి తగ్గడానికి వాస్తవమైన కారణం ఏమిటి? కేంద్రంలోని ప్రభుత్వాలు (గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బిజెపి) అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే ఈ పరిస్థితికి కారణమన్నది ఈ ప్రశ్నకు సమాధానం. ఆ విధానాల కారణంగానే దేశంలో ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని, అకలి కేకలను ఐక్యరాజ్యసమితి నుండి అనేక అంతర్జాతీయ నివేదికలు ఎత్తి చూపాయి. నిరుద్యోగం, ఉపాధి రహిత పరిస్థితులు పెరుగుతున్న తీరును అనేక నివేదికలు వివరించాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు చుక్కలను చూడటం ప్రజానీకానికి రోజూ అనుభవంలో ఉన్నదే! దీనిని నివారించడానికి ప్రభుత్వ ఖర్చును, ముఖ్యంగా పేదల కోసం చేసే ఖర్చును భారీగా పెంచాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎందరో నిపుణులు, ఆర్థిక వేత్తలు సూచించినా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధుల దిగ్గోతే దీనికి నిదర్శనం! వ్యవసాయ రంగంపైన ఇటువంటి నిర్లక్ష్యాన్నే మోడీ ప్రభుత్వం చూపించింది. కనీస మద్దతు ధర చట్టం కోసం ఏళ్ల తరబడి రైతాంగం చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకపోగా, యూరియాతో పాటు ఇతర ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ మొత్తంలో కోత పెడుతోంది. అదే సమయంలో వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరించేందుకు పథకాలు రూపొందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న అంతరాలు దేనికి నిదర్శనమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గణాంకాల్లో మాయాజాలం చేసి బూటకపు వృద్ధిని చూపించినా ఎక్కువ రోజులు ఆ టక్కుటమార విద్యలు వాస్తవాలు వెల్లడికాకుండా ఆదుకోలేవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి