Featured Post
రూపాయి మహాపతనం
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయ...
21, డిసెంబర్ 2024, శనివారం
రూపాయి మహాపతనం
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక శాతం క్షీణించింది. ఇదే ఒక రికార్డు కాగా, గురువారం ఈ పతనం మరింత దిగ్భ్రాంతికర స్థాయికి చేరింది. రూపాయి విలువ 85.08కి పడిపోయింది.ఇది ఆ ముందురోజుతో పోలిస్తే 14 పైసల తగ్గుదల.
అంటే ఒక్క డాలర్‌కు బదులుగా 85 రూపాయల ఎనిమిది పైసలు చెల్లించాల్సి వస్తుందన్నమాట! రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం గతంలో ఎన్నడూ లేదు. అందుకే ఈ పరిణామం ఆర్థిక నిపుణుల్లో కలకలం రేపింది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంలో ఈ చర్యలు ఏమాత్రం సుస్థిర ఫలితాలను సాధిస్తాయో వేచి చూడాల్సిందే! రూపాయి పతనం కొంత కాలంగా కొనసాగుతూనే ఉండటమే ఈ సందేహాలకు కారణం.సెప్టెంబర్ నెల నుండి ఈ పతనం స్పష్టంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్ 12వన డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.98కి పడిపోయింది. అప్పట్లో అదో రికార్డు. ఆ స్థాయికి రూపాయి విలువ పడిపోవడం అదే మొదటిసారి కావడంతో కలకలంరేగింది. మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక నిపుణులు రకరకాల విశ్లేషణలు చేశారు. అయితే, ప్రజలను చీల్చి ఎన్నికల పబ్బాలను గడుపుకునే పనిలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి అప్పట్లో ఈ విషయమే పట్టలేదు. ఫలితంగా పతనంలో రూపాయి కొత్త రికార్డులు సృష్టించడం ప్రారంభమైంది.
నిజానికి ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఈ దిశలో సంకేతాలు కనిపించాయి. ‘నిశితంగా గమనిస్తున్నాం. 2025 సంవత్సరం వరకు పతనం 84 రూపాయల మార్కుకు చేరకుండా చూస్తాం.’ అని ఆర్‌బిఐ వర్గాలు అప్పట్లో మీడియా ప్రతినిధులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాని జరిగింది వేరు. చూస్తుండగానే అక్టోబర్‌లో 84 రూపాయలకు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి ఎన్నికైనప్పటినుండి రూపాయి పతనం మరింత వేగంగా కొనసాగింది. అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన నవంబర్ ఆరున డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 84.23గా ఉంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న వివిధ ఇతర పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరుగుతాయన్న అంచనాలు కూడా రూపాయి విలువ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తంమీద రూపాయి వేగంగా పతనం చెందడంతో ఇప్పుడు ఒక డాలర్ విలువ 85 రూపాయలకుపైగా చేరింది. దీంతో రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్‌లోని విదేశీ పెట్టుబడులకు రెక్కలు వస్తున్నాయి. తమ పెట్టుబడుల విలువలు తగ్గిపోతుండటంతో విదేశీ మదుపర్లకు భారత మార్కెట్ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఒక్క నవంబర్ నెలలోనే 38 బిలియన్ డాలర్లను విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) ఉపసంహరించుకున్నారు. ఈ ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. దీనిప్రభావం దేశీయ మార్కెట్‌పైనా ఇదితీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కొంతకాలంగా సెన్సెక్స్ నేల చూపులు చూస్తుండటమే దీనికి నిదర్శనం.
నరేంద్రమోడీ దేశ ప్రధానిగా ఎన్నిక కావడానికి దోహదంచేసిన అనేక కారణాల్లో రూపాయి పతనం కూడా ఒకటి. 2014వ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 62.33 గా ఉండిరది. మోడీ అండ్‌కో దీనినే దేశ ప్రజల ముందు భూతద్దంలో చూపారు. తాము అధికారంలోకి వస్తే రూపాయిని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలోపేతం చేస్తామని, రూపాయి కోసం విదేశాలు క్యూలు కట్టే విధంగా చేస్తామని ప్రచారం చేశారు. కానీ, జరిగింది వేరు. దాదాపుగా ప్రతి ఏడాది రూపాయిది పతనోన్ముఖమే! బలహీనమైన రూపాయి కారణంగా దిగుమతులు మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో లోటు భారీగా పెరుగుతోంది. దీనికితోడు ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడం, తలసరి ఆదాయం పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకే పోతుండటం, జీవన ప్రమాణాలు పడిపోవడం వంటి మోడీ ప్రభుత్వ విధానాల ఫలితాలు కూడా దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఈ విధానాలను ప్రతిఘటించి, ప్రత్యామ్నాయం వైపు మళ్లడమే అన్ని సమస్యలకు పరిష్కారం.
2, డిసెంబర్ 2024, సోమవారం
‘భోపాల్’ దుర్ఘటనకు 40ఏళ్లు
కొన్ని కథలకు ప్రారంభమే గానీ ముగింపు ఉండదు. భారత పారిశ్రామిక చరిత్రలో మరచిపోలేని విషాద సంఘటనగా మిగిలిన భోపాల్ దుర్ఘటన (Bhopal Gas tragedy) బాధితుల కన్నీటి గాధలు కూడా అంతే! యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ (union Carbide Factory) కక్కిన విషంతో భోపాల్ మృత్యునగరంగా, శవాల దిబ్బగా మారి 40 ఏళ్లు (40 years) గడిచిపోయాయి. అయితే బాధితులకు మాత్రం నాయయం జరగలేదు. భోపాల్ గ్యాస్ పీడిత మహిళా ఉద్యోగుల సంఘటన్ కన్వీనర్ ‘ప్రధాన రాజకీయ పార్టీలు మమల్ని మోసం చేశాయి. మా సొంత పట్టణంలోనే మేం కాందీశీకులమయ్యాం. కాంగ్రెస్ మాకు ఏం చేసిందో, మోడీ నేతృత్వంలోని బిజెపికూడా అదే చేసింది’ అని అన్నారు. ఇప్పటికీ అదే దుస్థితి!
ఎన్నికల అజెండా చేసినా...
పాలకవర్గ పార్టీల నుండి ఏళ్లతరబడి నిర్లక్ష్యాన్నే చవిచూస్తున్న బాధిత ప్రజానీకం గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ కష్టాలను రాజకీయ అజెండాగా మార్చడానికి బలంగా కృషి చేసింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఈ సంఘాలన్నీ సమావేశమైనాయి. కార్భైడ్ ఫ్యాక్టరీ నుండి తమకు న్యాయంగా రావాల్సిన 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించాలని, తమ పిల్లలకు భద్రమైన భవిష్యత్‌ను అందించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్టీలు, అభ్యర్థుల నుండి రాతపూర్వకంగా తీసుకోవాలని నిర్ణయించాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజానీకం కూడా వీరికి మద్దతు తెలిపారు. భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భోపాల్ అంతా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల పచారానికి వచ్చిన అభ్యర్థులను ప్రశ్నించారు. ‘మా కోసం కాదు... భావి తరాల వారికోసం ఏం చేస్తారో చెప్పండి’ అని నిలదీశారు. న్యాయం చేస్తామని మాట వరసకు చెప్పడం కాదు .. రాత పూర్వకంగా ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. ఆ ఎన్నికలప్పుడు వాగ్ధానాలు ఇచ్చిన వివిధ పార్టీలు ఆ తరువాత మళ్లీ మాములుగానే విస్మరించాయి.
భోపాల్‌లో ఏం జరిగింది?
1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి ‘యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ’ నుండి ఒక్కసారిగా వెలువడిన విష వాయువులు భోపాల్ నగరాన్ని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా విషవాయువులు చుట్టుముట్టడంతో ఏం జరుగుతోందో అర్ధంకాక, ఊపిరి ఆడక నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. విష వాయువుల బారి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన వారు రోడ్లపైనే తుది శ్వాస విడిచారు. తెల్లవారే సమయానికి ఎక్కడ చూసినా శవాల కుప్పలతో భోపాల్ మృత్యు నగరంగా మారింది. వేలాది మంది ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో 10,047 మంది ప్రాణాలు కోల్పోయారని, 5,74,000 మంది విషవాయువుల ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వ అంచనా! ఈ అంకెలనే పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అయితే, మృతుల సంఖ్య 15వేలపైనే ఉంటుందని వివిధ స్వఛ్చంద సంస్థలు, సంఘాలు ప్రకటించాయి. రసాయన పారిశ్రామిక రంగంలో హీరోషిమా అణుబాంబు విస్ఫోటనంతో సమానమైనదిగా ఈ దారుణాన్ని నిపుణులు పోల్చారు. విష వాయువుల దుష్ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. ప్రత్యక్ష బాధితులు ఈ విషాద సంఘటన జరిగిన ఇన్నేళ్ల తరువాత కూడా శిశువులు శారీరక, మానసిక వైకల్యంతో పుడుతూనే ఉన్నారు. భూగర్భ జలాలు విషతుల్యంగానే ఉన్నాయి. ఇంకా దారుణమేమిటంటే నష్టపరిహారం కోసం బాధిత కుటుంబాలు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉండటం! విస్మయాన్ని కలిగించే విషయమేమిటంటే ఇంతటి కల్లోలానికి కారణమైన విషవాయువేమిటో ఇప్పటికీ తెలియకపోవడం! ‘తయారీ రహస్యం’ పేరిట కార్బైడ్ సంస్థ ఆ వివరాలను వెల్లడిరచడం లేదు. మిథైల్ ఐసోసెనెట్ (ఎంఐసి) అనే రసాయనం లీక్ కావడమే ఈ విషాదానికి కారణమని ఇతర అధ్యయనాలు తేల్చినా అధికారిక ధృవీకరణ కోసం భారత ప్రభుత్వం ఏనాడు పట్టుబట్టలేదు. అంతేకాదు, ఈ దుర్ఘటన వెనుక ‘కార్బైడ్’ యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్లు నిరూపించడంలోనూ భారత ప్రభుత్వం విజయవంతం కాలేదు. నామమాత్రంగా దక్కిన 25 వేల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబాలు తిరస్కరించాయి.
తగ్గిన రోగనిరోధక శక్తి
భోపాల్ : విషవాయువు బారిన పడిన వారిలోనూ, వారి సంతానంలోనూ రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గింది. కరోనా విజృంభించిన సమయంలో ఈ విషయం వెల్లడైంది. భోపాల్ నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా సోకి చికిత్స పొందిన వారిలో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)